Kumari Aunty: కుమారి ఆంటీ ఎన్నిక‌ల ప్ర‌చారం.. ఏ పార్టీ త‌ర‌ఫునంటే..!

  • గుడివాడలో కుమారి ఆంటీ ఎన్నిక‌ల‌ ప్రచారం
  • టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ఎన్నిక‌ల ర్యాలీ
  • మహర్షి సినిమాలో మహేశ్‌ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి రాము అంటూ ప్రశంస
  • ఉపాధి అవకాశాలు లేకపోవంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వ‌స్తుందంటూ ఆవేద‌న‌
  • ఎన్‌డీఏ కూట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌న్న కుమారి ఆంటీ
Kumari Aunty Election Campaign in Gudivada

హైదరాబాద్ కుమారి ఆంటీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ వీడియోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్షేషన్ అయ్యారామె. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఏపీ ఎన్నికల వేళ కుమారి ఆంటీ మరోసారి వార్త‌ల్లో నిలిచారు. ఆమె గుడివాడ టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలోని 21, 24, 25, 31, 32 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వెనిగండ్ల రాముపై కుమారి ఆంటీ ప్రశంసలు కురిపించారు. 

మహర్షి సినిమాలో మహేశ్‌ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. ఆ సినిమాలో మహేశ్‌ బాబు ప్రజల కోసం సేవ చేస్తే, రియల్ లైఫ్ లో గుడివాడ‌లో రాము సేవ చేస్తున్నార‌ని కొనియాడారు. తన స్వస్థలమైన పెద్ద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రజలందరి మంచి కోసమే తాను ప్రచారానికి వచ్చిన‌ట్లు పేర్కొన్నారు. గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు. వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి చెందుతుంద‌ని కుమారి ఆంటీ వ్యాఖ్యానించారు. 

తన స్వస్థలమైన గుడివాడపై ప్రేమ, మమకారంతో ఇక్కడికి వచ్చానని.. ఇక్కడ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రాముకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. గుడివాడలో ఉపాధి అవకాశాలు లేకపోవంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందన్నారు. కొడాలి నాని హయాంలో అభివృద్ధి లేకపోగా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడలేదని దుయ్య‌బ‌ట్టారు. 

వెనిగండ్ల రాము చ‌క్క‌టి విజన్ ఉన్న నేత అని.. కష్టపడేవారికి, విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్ప‌టికే చర్యలు తీసుకున్నారని ఆమె గుర్తు చేశారు. రాము వంటి నేతలు అధికారంలో ఉంటే.. తమలాంటి వారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా వెనిగండ్ల రామును, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వల్లభనేని బాలశౌరిని గెలిపించి, ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలని కుమారీ ఆంటీ కోరారు. 

ఇక ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్రావు, మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు , జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, 32, 31, 25, 21,24 వార్డుల టీడీపీ, జనసేన కమిటీల సభ్యులు పాల్గొన్నారు. అలాగే గుడివాడ నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు, తెలుగు మహిళలు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, టీడీపీ జనసేన అనుబంధ విభాగాల నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News